India: అతిథిని ఆహ్వానించడానికి మరోసారి ప్రొటోకాల్ పక్కన పెట్టనున్న నరేంద్ర మోదీ!

  • నేటి నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పర్యటన
  • మధ్యాహ్నం స్వయంగా స్వాగతం పలకనున్న మోదీ
  • రేపు ఆగ్రాకు నెతన్యాహూ దంపతులు

ఇండియాకు వచ్చే విదేశీ అధినేతలకు స్వాగతం చెప్పేందుకు ప్రొటోకాల్ పక్కనబెట్టి మరీ వెళ్లే ప్రధాని నరేంద్ర మోదీ, నేడు మరోసారి అదే పని చేయనున్నారు. నేటి నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, భారత్ లో పర్యటించనుండగా, ఈ మధ్యాహ్నం ఆయనకు, ఆయన సతీమణి సారాకు విమానాశ్రయంలో ప్రధాని స్వయంగా స్వాగతం పలుకుతారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ ఇండియాకు వచ్చి వెళ్లిన తరువాత, మళ్లీ ఆ దేశ ప్రధాని రావడం ఇదే తొలిసారి. అధికారిక స్వాగత కార్యక్రమాల అనంతరం వీరిరువురూ తీన్ మూర్తి స్మారకచిహ్నం వద్దకు వెళ్లి, వంద సంవత్సరాల క్రితం హైఫా యుద్ధంలో పాల్గొన్న మూడు భారత రెజిమెంట్లలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

 కాగా, నెతన్యాహూ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. గత జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లగా, ఆయనకు ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అంతే స్థాయిలో నెతన్యాహూకు ఆతిథ్యం ఇవ్వాలని, భారత పర్యటన ఆయనకు గుర్తుండి పోయేలా చూడాలని ప్రధాని భావిస్తున్నారు. ఇక రేపు నెతన్యాహూ, సారా దంపతులు ఆగ్రా వెళ్లి, తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.

More Telugu News