Andhra Pradesh: ఏపీ నుంచి వచ్చి, తెలంగాణలో దొంగతనాలు చేస్తున్న మహిళలు... పట్టించిన సీసీటీవీ!

  • ఆలయంలో కాటేజీ తీసుకుని దొంగతనాలు
  • పెబ్బేరు బస్టాండులో 5 తులాల బంగారం చోరీ
  • పట్టించిన చీరలు!

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల కాటేజీని అద్దెకు తీసుకుని, రద్దీగా ఉండే బస్టాండ్లను టార్గెట్ చేసుకుని గొలుసులు దొంగతనం చేస్తుండగా, సీసీటీవీ ఫుటేజ్ లు వారిని పట్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెబ్బేరు బస్టాండులో చంద్రకళ అనే మహిళ బస్సు ఎక్కుతుండగా, 5 తులాల బంగారు గొలుసును దొంగలు తస్కరించారు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తుండగా ఇద్దరు మహిళలపై అనుమానం వచ్చింది. వారి చిత్రాలను సమీప పోలీసు స్టేషన్లకు పంపించారు పోలీసులు. ఆపై పెబ్బేరు చౌరస్తాలో వనపర్తి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళల చీరలు చూసిన హోంగార్డు మార్కండేయరెడ్డి, వారే దొంగలని అనుమానించాడు. ఆ బస్సు డ్రైవర్ కు విషయం చెప్పి, దాన్ని సరాసరి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారించి నిజం కక్కించారు. ఆపై బీచుపల్లిలోని కాటేజీ వద్దకు వెళ్లి, అక్కడ నిఘా పెట్టి, తాళం తీసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News