Vairamuthu: శ్రీ ఆండాళ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తమిళ సినీ గేయ రచయితపై కేసు

  • హిందూ మున్నానీ కార్యకర్త ఫిర్యాదుతో కేసు నమోదు
  • వైరముత్తు వ్యాఖ్యలపై దర్యాప్తు జరుపుతామన్న పోలీసులు
  • ఏడు జాతీయ అవార్డులను అందుకున్న వైరముత్తు

ఏడో శతాబ్దానికి చెందిన శ్రీ ఆండాళ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తుపై కేసు నమోదైంది. హిందూ మున్నానీ కార్యకర్త ఫిర్యాదు మేరకు తమిళనాడులోని రాజాపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైరముత్తు వ్యాఖ్యలపై విచారణ చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. 12 ఆళ్వారు సన్యాసుల్లో ఒకరైన శ్రీ ఆండాల్‌కు వ్యతిరేకంగా వైరముత్తు వ్యాఖ్యలు చేయడంతో ఆయనను ఆరాధించే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మున్నానీ కార్యకర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
1980లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా  సినిమా ‘నిళల్‌గల్’తో కోలీవుడ్‌లోకి సినీ గేయ రచయితగా పరిచయం అయిన వైరముత్తు ప్రముఖ గేయ రచయితగా ఎదిగారు. ఆయన పాటలకు తమిళనాట బోల్డంతమంది అభిమానులు ఉన్నారు. ఉత్తమ గేయ  రచయితగా ఇప్పటి వరకు ఏడు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. 2003లో తమిళంలో ఆయన రాసిన ‘కల్లికట్టు ఐతికాసమ్’ అనే నవలకుగాను ఈ అవార్డు దక్కింది. 2003లోనే ‘పద్మశ్రీ’, 2014లో ‘పద్మభూషణ్’ వంటి పౌరపురస్కరాలను వైరముత్తు అందుకున్నారు.

More Telugu News