Revanth Reddy: రాజకీయాల్లో ఛాలెంజ్ లు స్వీకరించేటప్పుడు ముందుగానే ఆలోచించాలి!: తమ్మారెడ్డి భరద్వాజ

  • రేవంత్ తో మనం మాట్లాడొచ్చా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఆలోచిస్తే బాగుండేది
  • చర్చకు ఒప్పేసుకుని, ఆ తర్వాత కాదనడం కరెక్టు కాదు
  • ‘నా ఆలోచన’లో తమ్మారెడ్డి భరద్వాజ

విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసరడం, అందుకు ‘సరే’ అని రేవంత్ చెప్పడం విదితమే.

ఆ తర్వాత రేవంత్ వంటి విశ్వసనీయత లేని వ్యక్తులతో చర్చకు దిగమని, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటి వారు రావాలని బాల్క సుమన్ పేర్కొనడం, ‘అధికార పార్టీ వారు చర్చకు రాకుండా పారిపోయారు’ అని రేవంత్ అనడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ ద్వారా స్పందించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ‘యూట్యూబ్’ లో పోస్ట్ చేశారు.  

‘రాజకీయాల్లో ఛాలెంజ్ లు స్వీకరించేటప్పుడు ముందుగానే ఆలోచించాలి. రేవంత్ రెడ్డితో మనం మాట్లాడొచ్చా? లేదా? అనే విషయాన్ని ముందుగానే ఆలోచిస్తే బాగుండేది. చర్చకు ఒప్పేసుకుని, ఆ తర్వాత కాదనడం కరెక్టు కాదని నాకు అనిపించింది. నిజంగా, చర్చ జరిగినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు. ఎవరి కోణంలో వారు కరెక్టు అనిపిస్తారు. ఇవన్నీ, అంత తేలికగా తేలే సమస్యలు కాదు. ప్రతి నాణేనికి రెండు వైపులున్నట్టుగా ప్రతి ఒప్పందానికి రెండు రకాల అర్థాలు ఉంటాయి. వాళ్లు చెప్పే అర్థం వాళ్లు, వీళ్లు చెప్పే అర్థం వీళ్లు చెబుతారు.

దానివల్ల మనం తికమక పడటం తప్పా, ఏముండదు. ఇంతకుముందు మనకు గంట పాటు కూడా రాదు అనుకునే విద్యుత్, ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? డబ్బులు చేతులు మారాయా?..వీటిపై చర్చ పెట్టుకుంటే ఇవాళ అయ్యేది కాదు. ఈ మధ్య సమాజంలో అవినీతి లేకుండా ఏ పనీ జరగట్లేదు! దీని గురించి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.

 ఏ పార్టీకి అయినా మనం చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం మంచిదని నా అభిప్రాయం. పని జరిగిందా? లేదా? అనేది ముఖ్యం. మిగిలిన విషయాలపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. కనుక, రాజకీయనాయకులు జనాలను తికమకపెట్టకుండా భవిష్యత్ లో నైనా మాట్లాడాలనేది నా ఆలోచన’ అని తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News