Malasia: ఎంహెచ్ 370 విమాన శకలాలను కనిపెట్టండి.. రూ.445 కోట్లు పట్టుకెళ్లండి.. మలేషియా ఆఫర్!

  • అమెరికా కంపెనీతో మలేషియా ఒప్పందం
  • 90 రోజులపాటు దక్షిణ హిందూ మహా సముద్రంలో గాలింపు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

మార్చి 2014లో 239 మంది ప్రయాణికులతో వెళ్తూ అదృశ్యమైన మలేషియాకు చెందిన ఎంహెచ్‌ 370  విమానం ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా కంపెనీతో మలేషియా ప్రభుత్వం  భారీ డీల్ కుదుర్చుకుంది. విమానం ఆచూకీని గుర్తిస్తే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 445 కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గతంలో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విమానం ఆచూకీని గుర్తించేందుకు ముందుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమాన శకలాలను గుర్తించడంలో సదరు కంపెనీ విఫలమైంది. దీంతో గతేడాది జనవరిలో వెతకడం ఆపేశారు.

తాజాగా బుధవారం విమాన శకలాలను గుర్తిస్తే భారీగా నగదు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, విమాన ఆచూకీని గుర్తించడంలో విఫలమైతే మాత్రం పైసా కూడా ఇచ్చేది లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆఫర్‌కు స్పందించిన అమెరికా కంపెనీ విమాన శకలాలను వెతికేందుకు ముందుకొచ్చింది. దక్షిణ హిందూ మహా సముద్రంలో అత్యాధునిక నౌక ద్వారా విమానాన్ని గుర్తించేందుకు అమెరికా కంపెనీ రంగంలోకి దిగనుంది. ఈ నెల మధ్య నుంచి 90 రోజులపాటు విమాన శకలాల కోసం గాలించనున్నారు.

ఎంహెచ్ 370 విమాన అదృశ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా మిగిలిపోయింది. మలేషియా సహా పలు దేశాలు విమానం కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గాలింపును నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ విమానంలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు.

More Telugu News