kona venkat: ఇదే మ‌న అమ్మ గురించో.. చెల్లి గురించో ఎవ‌రైనా మాట్లాడితే చాచిపెట్టి కొడ‌తాం!: కోన వెంక‌ట్

  • పవన్ ఫ్యాన్స్ బాధపడుతూ యూ ట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నారు
  • వారి ఆవేశం అర్థం కావ‌ట్లేదా?
  • నాకు కూడా ఆవేశం వ‌స్తోంది
  • ఇంత‌గా బ‌రితెగిస్తూ వ్యాఖ్య‌లు చేస్తారా?

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో ప‌వ‌ర్ స్టార్ అభిమానుల ర‌క్తం ఉడికిపోతోంద‌ని ర‌చ‌యిత కోన వెంక‌ట్ అన్నారు. మ‌రీ ఇంత బ‌రితెగింపుగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. 'ఇదే మ‌న అమ్మ గురించో.. నాన్న గురించో, చెల్లి గురించో ఎవ‌రైనా తక్కువగా మాట్లాడితే చాచిపెట్టి కొడ‌తాం.. అది చ‌ట్ట‌రీత్యా త‌ప్పో ఒప్పో ఆలోచించ‌బో'మ‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కోట్ల‌మంది అభిమానిస్తారని, ఆయ‌న నిస్వార్థంగా ఆలోచిస్తారని చెప్పారు. పవన్‌ను అభిమానులు తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారని వ్యాఖ్యానించారు.

త‌నకున్న‌ అభిమాన బ‌లాన్ని ఓ మార్గంలో పెట్టి స‌మాజంలో మంచిని పెంపొందించాల‌నే ప‌వ‌న్ పార్టీ పెట్టాడని తాను అనుకుంటున్నాన‌ని కోన వెంకట్ అన్నారు. సీఎం, పీఎం అయిపోదామ‌న్న ఆశ‌లు పవన్ కల్యాణ్‌కు లేవని చెప్పుకొచ్చారు. మహేశ్ కత్తి చేస్తోన్న వ్యాఖ్యలపై బాధ పడుతూ పవన్ ఫ్యాన్స్ ష‌బానా, విష్ణు అనే యువత యూ ట్యూబ్ లో వీడియోలు పెట్టారని కోన వెంకట్ అన్నారు. అమెరికా, జ‌ర్మనీ నుంచి దేశ విదేశాల నుంచి ఎంతో మంది వీడియోలు పెడుతున్నారని అన్నారు. వారి ఆవేశం అర్థం కావ‌ట్లేదా? అని ప్రశ్నించారు. అసలు తనకు కూడా ఆవేశం వ‌స్తోందని వ్యాఖ్యానించారు.

ఇంత‌గా బ‌రితెగిస్తూ వ్యాఖ్య‌లు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఓ స్థాయిని దాటి హ‌ద్దులు దాటి వ్యాఖ్య‌లు చేస్తున్నారని ఆయన కత్తిపై మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కూడా స‌హ‌నం వ‌హించాలని, ఈ వివాదాన్ని పెంచుకుంటూ వెళ్ల‌కూడ‌దని కోన వెంకట్ సూచించారు.

More Telugu News