talaq: ఫోన్‌లో ట్రిపుల్ త‌లాక్ పంపిన భ‌ర్త‌.. ఇంట్లోంచి గెంటేసిన అత్తింటివారు!

  • ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • సౌదీకి వెళ్లిన బాధితురాలి భ‌ర్త‌
  • త‌న‌కు ఓ కొడుకు కూడా ఉన్నాడంటూ బాధితురాలు క‌న్నీరు
  • పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌ని వైనం

ముస్లిం మ‌హిళ‌ల జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న ట్రిపుల్‌ తలాక్ ప‌ద్ధ‌తిని సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లోనూ ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందింది. అయిన‌ప్ప‌టికీ ట్రిపుల్ త‌లాక్ కేసులు ఏ మాత్రం ఆగ‌డం లేదు. ఓ వ్య‌క్తి త‌న భార్య‌కు ఫోన్‌లో ట్రిపుల్ త‌లాక్ చెప్పేసి విడాకులు ఇచ్చిన ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది.

త‌న భ‌ర్త‌ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని, త‌న భర్త కుటుంబ సభ్యులు బైక్ కొనివ్వాలని గతంలో త‌న‌ను రోజూ వేధించేవారని బాధిత యువతి చెప్పింది. త‌న‌ భర్త త‌న‌ను స‌రిగ్గా చూసుకోవ‌డం లేద‌ని, ఆయ‌న‌ సౌదీకి వెళ్లిన కొన్ని రోజులకు త‌న‌కు తలాక్ చెబుతూ మెసేజ్ పంపించాడని క‌న్నీరు పెట్టుకుంది. త‌న‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడ‌ని తెలిపింది. త‌న భ‌ర్త త‌లాక్ చెబుతూ మెసేజ్ పంప‌డంతో త‌న మెట్టినింటివారు త‌న‌ను ఇంట్లోంచి వెళ్ల‌గొట్టార‌ని చెప్పింది. ట్రిపుల్ త‌లాక్ చెబితే విడాకులు ఇచ్చేసినట్లేన‌ని, తాము పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌లేద‌ని బాధితురాలి తండ్రి మీడియాకు తెలిపాడు.

More Telugu News