Kadapa: మరికాసేపట్లో జగన్ ఇలాకాలోకి చంద్రబాబు!

  • నేడు పులివెందులలో జన్మభూమి
  • స్వయంగా గ్రామసభలో పాల్గొననున్న చంద్రబాబు
  • పలువురు వైకాపా నేతలు టీడీపీలో చేరే అవకాశం!
ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'జన్మబూమి-మాఊరు'లో భాగంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనుండటంతో, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు నూతనోత్సాహంతో పని చేస్తున్నారు. తొలుత లింగాల మండలం పార్నపల్లె గ్రామం వద్ద నిర్మించిన గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు, ఆపై మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలో జరగనున్న జన్మభూమి గ్రామసభలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకూ వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న పలువురు నేతలను టీడీపీలో చేర్చేందుకు కూడా ఆ పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసి విజయం సాధించినట్టు సమాచారం. వైఎస్ కుటుంబాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆదరిస్తూ వచ్చిన పులివెందులలో పాగా వేసేందుకు టీడీపీ చానాళ్లుగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే పులివెందులపై ప్రత్యేక దృష్టిని సారించిన చంద్రబాబు, నేడు పులివెందులలో జరిగే కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడం గమనార్హం.
Kadapa
Pulivendula
Chandrababu
Jagan
YSRCP

More Telugu News