CBI: ఫ్రాన్స్ లో అదృశ్యమైన 22 మంది భారత టీనేజర్లు!

  • రూ. 30 లక్షల వరకూ చెల్లించిన 25 మంది టీనేజర్లు
  • రగ్బీ క్యాంపు పేరిట ఫ్రాన్స్ చేర్చిన ట్రావెల్ ఏజంట్లు
  • వెనక్కు వచ్చింది ఇద్దరే, పోలీసులకు పట్టుబడిన మరో యువకుడు
  • మిగతావారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సీబీఐ

ట్రావెల్ ఏజంట్లకు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షలు చెల్లించి ఫ్రాన్స్ కు వెళ్లిన 22 మంది భారత టీనేజర్లు అదృశ్యమయ్యారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వారు గత సంవత్సరంలో ముగ్గురు ట్రావెల్ ఏజంట్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఫ్రాన్స్ కు వెళ్లారు. వీరిని రగ్బీ కోచింగ్ నిమిత్తం తీసుకెళుతున్నట్టు రికార్డుల్లో ఉంది.

ఫరీదాబాద్ లోని లలిత్ డేవిడ్, ఢిల్లీలోని సంజీవ్ రాయ్, వరుణ్ చౌదరిలు వీరిని ఫ్రాన్స్ కు పంపారు. 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న 25 మందిని ఫ్రాన్స్ లో జరిగే రగ్బీ ట్రైనింగ్ క్యాంప్ కోసమని వీసా దరఖాస్తుల్లో ఉంది. వీరిలో 22 మంది ఆచూకీ తెలియరావడం లేదు. ఇక వీరి ఆచూకీని కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన సీబీఐ, కేసు నమోదు చేయడంతో పాటు ట్రావెల్ ఏజంట్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఫెడరేషన్ తో చర్చిస్తున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. ఈ 25 మందీ పారిస్ వెళ్లారని, ఆపై వారం రోజుల పాటు రగ్బీ క్యాంపులో పాల్గొన్నారని, ఆ తరువాత ట్రావెల్ ఏజంట్లు వారి రిటర్న్ టికెట్లను క్యాన్సిల్ చేశారని, అంతకుముందే ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించి, ఇద్దరు ఇండియాకు వెనక్కు వచ్చారని తెలిపారు. మరో యువకుడు ఫ్రెంచ్ పోలీసులకు పట్టుబడ్డాడని, ఈ విషయం ఫ్రాన్స్ ఇంటర్ పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందిందని అన్నారు. మిగతావారి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు.

More Telugu News