Madhya Pradesh: హెలికాప్టర్ లో వచ్చి, 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోబోయిన మధ్యప్రదేశ్ నేత... పదవి ఊడింది!

  • పేదింటి అమ్మాయిపై పడ్డ సర్పంచ్ కన్ను
  • విషయం తెలుసుకున్న అధికారులు.. ఆగిన పెళ్లి
  • కేసు నమోదు, పదవికి దూరం

సర్పంచ్ గా రాజకీయ పదవిలో ఉంటూ, ఒక పెళ్లి చేసుకుని, తిరిగి రెండో పెళ్లికి, అందునా 12 ఏళ్ల బాలికను గ్రాండ్ స్టయిల్ లో వివాహం చేసుకోవాలనుకున్న 51 ఏళ్ల వ్యక్తి కోరిక నెరవేరకపోగా, ఇప్పుడు అనుభవిస్తున్న పదవికీ దూరమయ్యాడు. మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లా బహార్ జాగీర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జగన్నాథ్ మవాయ్ అనే సర్పంచ్ కన్ను ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయిపై పడింది. పెద్దలను ఒప్పించాడు.

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి కొడుకుగా హెలికాప్టర్ లో వచ్చి అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పాడు. ఆ గ్రామంలో తాత్కాలిక హెలిపాడ్ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నాడు. పెళ్లి పనులు చకచకా సాగుతున్న వేళ, అతని కాబోయే భార్య 12 ఏళ్ల బాలికన్న సమాచారం పోలీసులకు, జిల్లా చైల్డ్ డెవలప్ మెంట్ అధికారులకు అందింది. వారు ఆమె చదువుతున్న స్కూలుకు వెళ్లి రికార్డులను పరిశీలించి, పక్కా ఆధారాలను కలెక్టర్ ముందుంచారు.

తర్వాత ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, పెళ్లిని ఆపగా, మధ్య ప్రదేశ్ పంజాయత్ రాజ్ అవామ్ గ్రామ్ స్వరాజ్ చట్టం ప్రకారం, సర్పంచ్ పదవికి దూరమయ్యాడు. మరో ఆరేళ్ల పాటు ఏ విధమైన ఎన్నికల్లో పాల్గొనకుండా అతనిపై నిషేధం కూడా పడింది. బాల్య వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల ప్రకారం కేసు పెట్టామని అన్నారు.

More Telugu News