kalva srinivasulu: వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చ‌డానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు!: ఏపీ మ‌ంత్రి కాల్వ‌ శ్రీనివాసులు

  • వాల్మీకి, బోయల సమస్యల‌ను పరిష్కరించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం కృషి
  • కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్‌తో చ‌ర్చ‌లు
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి  సిఫార్సు
  • వివ‌రాలు తెలిపిన మ‌ంత్రి కాల్వ‌ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకి, బోయల సామాజిక హోదాను మార్పు చేసి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ సానుకూలంగా స్పందించినట్లు ఆంధ్ర ప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు తెలిపారు. సుదర్శన్ భగత్ ను ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లో ఈ రోజు మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు కలసి ఆంధ్రప్రదేశ్ లోని బోయ, వాల్మీకి ప్రజల విషయంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సామాజిక హోదా మార్పు అంశానికి సంబంధించి మెమొరండంను కేంద్ర‌ మంత్రికి సమర్పించి చర్చించారు.

ఈ సందర్భంగా కాల్వ‌ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గ‌తంలో చేసిన‌ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి, బోయల సామాజిక హోదాను మార్పు చేసి ఎస్టీ జాబితాలో చేర్చడానికి  హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిని సానుకూల పరచేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈనెల 15 వ తేదీన సమర్పించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని 2016 సంవత్సరం బడ్జట్ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చామ‌న్నారు.

వాల్మీకి, బోయ ప్రజల సామాజిక స్థితిగతులను (Ethnographical Study), జీవనశైలి, వృత్తి నేపథ్యాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించుటకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ విభాగం ప్రధాన ఆచార్యులు ఆచార్య సత్యపాల్ కుమార్ ను నియమించిందని చెప్పారు. సత్యపాల్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమర్పించిన నివేదికను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు కూడా సమర్పించగా, ఈ కమిషన్ కూడా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుడానికి సిఫార్సు చేసిందని చెప్పారు.

ఈ అంశాలను కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ దృష్టికి తీసుకు వెళ్లి చర్చించగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ కు పంపి, వారి నివేదిక ఆధారంగా జాతీయ ఎస్.టి కమీషన్ కు సమర్పించి జాప్యం లేకుండా కాబినెట్ సమావేశంలో చర్చించి ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు.

 ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్, 1961 భారత దేశపు జనగణన డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ బి.కె. రాయ్ బర్మన్, 1961-62 గిరిజన తెగల విచారణ కమిటీ కూడా వాల్మీకి, బోయ ప్రజల జీవన శైలి, సామాజిక నేపథ్యంపై సమగ్ర సర్వే జరిపి వీరిని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చుడానికి సిఫారసు చేసినట్లు చెప్పారు.

More Telugu News