railway: రైల్వే శాఖకు రూ.30,000 కోట్లు... విద్యుత్ పంపిణీ లైన్ల విక్రయ ప్రయత్నాలు!

  • రైల్వేకు దేశవ్యాప్తంగా 30,000 కిలోమీటర్ల లైన్లు
  • వీటి విక్రయానికి రెండు సంస్థలతో చర్చలు
  • అమ్మకంతో వచ్చే నిధులు సామర్థ్య విస్తరణకు వినియోగం

నిధుల కటకటను ఎదుర్కొంటున్న రైల్వే శాఖకు ఏకంగా రూ.30,000 కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే శాఖకు 30,000 కిలోమీటర్ల మేర విద్యుత్ పంపిణీ లైన్లు ఉన్నాయి. వీటిలో వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలు రెండు ఈ విషయంలో ఆసక్తితో ఉండడంతో రైల్వే శాఖ వాటితో చర్చలు జరుపుతోంది. విద్యుత్ లైన్లను విక్రయించేసి ఆ తర్వాత వాటిని లీజుకు తీసుకోవాలన్నది ఆలోచన. దీనివల్ల రైల్వే శాఖకు ఉన్నఫళంగా రూ.30,000 కోట్ల మేర నిధులు అందివస్తాయి.

ఈ నిధులను వచ్చే ఏడాది సామర్థ్య విస్తరణపై ఖర్చు చేయాలనుకుంటోంది. విద్యుత్ పంపిణీ లైన్ల నిర్వహణకు గాను  ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఖరీదైన ప్రాంతాల్లో తనకున్న భూముల్లో కొంత మేర విక్రయించే ఆలోచన కూడా రైల్వే పరిశీలనలో ఉంది. ఢిల్లీ, ముంబైలోని మూడు చోట్ల భూములను కూడా గుర్తించింది. వీటి విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు రైల్వే శాఖకు లభించనున్నాయి. వచ్చే ఏడాది రైల్వే శాఖ సామర్థ్య విస్తరణపై రూ.1.5 లక్షల కోట్ల వరకు వ్యయం చేయనుంది.

More Telugu News