Andhra Pradesh: ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన యువతి.. సినిమాను తలపించే ట్విస్ట్‌లు!

షార్ట్స్‌లో చూడండి
ఇది సినిమా కాదు.. కానీ అంతకుమించిన ట్విస్టులున్నాయి. ఒక అమ్మాయి మరో ముగ్గురిని పెళ్లాడింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దముడియం మండలం భీమగుండానికి చెందిన బాబు, ఎలీసమ్మ దంపతుల కుమార్తె మౌనిక (20) పదో తరగతి చదువుకుంది. 9 నెలల క్రితం పులివెందులలోని ఓ టెక్స్‌టైల్ పరిశ్రమలో ఉద్యోగంలో చేరింది. అదే మిల్లులో పనిచేస్తున్న రమాదేవి (18)తో మౌనికకు పరిచయం అయింది. స్నేహం చిగురించి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఓ గది తీసుకుని పెళ్లి చేసుకున్నారు.

తాజాగా క్రిస్మస్ పండుగ కోసం తల్లిదండ్రులు మౌనికను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మౌనిక.. రమాదేవి పేరునే పలవరిస్తుండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తాను, రమాదేవి పెళ్లి చేసుకున్నామని, ఆమె లేకుండా తాను బతకలేనని చెప్పడంతో షాక్ తిన్నారు. ఎంతగా నచ్చజెప్పినా వినకపోవడంతో జమ్మలమడుగు పోలీసులను ఆశ్రయించారు. అక్కడికి వెళ్లాక మౌనిక తల్లిదండ్రులకు ఊహించని మరో షాక్ తగిలింది.

మౌనిక ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని, రమాదేవితో జరిగింది మూడో వివాహమని పోలీసుల విచారణలో తేలడంతో అందరూ విస్మయానికి లోనయ్యారు. అయితే వీరి విషయం బయటపడడంతో బాధిత అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చి కుమార్తెలను తీసుకెళ్లినట్టు మౌనిక తెలిపింది. కొన్ని రోజులుగా రమాదేవి ఆహారం తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయిందని, ప్రస్తుతం అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని జమ్మలమడుగు డీఎస్పీ కోలా కృష్ణన్ తెలిపారు. ఆమె కోలుకోగానే మరిన్ని వివరాల కోసం విచారణ చేపడతామని, ఆపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Girl
Marriage
Kadapa

More Telugu News