Guntur: ఓ ఐడియా అతడిని జైలుకు పంపింది.. తెనాలిలో నకిలీ నోట్లు చలామణి చేస్తూ పోలీసులకు చిక్కిన యువకుడు!

  • స్కానర్ సాయంతో వంద నోట్లకు నకిలీ నోట్ల తయారీ
  • అసలు నోట్లతో కలిపి చలామణి
  • ప్రస్తుతం కటకటాల్లో నిందితుడు

ఓ ఐడియా సాఫీగా సాగిపోతున్న అతడి జీవితాన్ని జైలుపాలు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను కలర్ జిరాక్స్‌ తీయిస్తే అచ్చుగుద్దినట్టు అలాగే ఉండడంతో నిందితుడికి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. లైసెన్సే అంత బాగా వస్తే వంద రూపాయల నోట్లు ఇంకెంత బాగా వస్తాయో అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ వంద నోటును జిరాక్స్ తీస్తే అసలో, నకిలీయో తెలుసుకోలేనంతగా వచ్చింది. ఇంకేముంది.. వరుసపెట్టి జిరాక్స్ తీశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిందీ ఘటన. నిందితుడు చెన్నంశెట్టి సాయి గౌరీనాథ్ గతంలో పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను జిరాక్స్ తీయించుకున్నాడు. అది అచ్చం ఒరిజినల్‌లానే ఉండడంతో తాజాగా అతడి మెదడులో ఓ ఆలోచన మొలకెత్తింది.

 వెంటనే ఓ స్కానర్‌ను కొనుగోలు చేసి వంద రూపాయల నోట్లను జిరాక్స్ తీయడం ప్రారంభించాడు. వాటిని అసలు నోట్లతో కలిపి చలామణి చేయడం ప్రారంభించాడు. ఇలా గత మూడు నెలలుగా రూ.25వేల విలువైన దొంగనోట్లు చలామణి చేశాడు. అతడి నకిలీ దందాపై ఉప్పందుకున్న పోలీసులు నిఘావేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గౌరీనాథ్ నుంచి 60 నకిలీ వంద నోట్లు, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News