jampanna: భార్య‌తో క‌లిసి పోలీసుల‌కు లొంగిపోయిన మావోయిస్టు నేత జంప‌న్న‌!

  • మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి
  • సైద్ధాంతిక విబేధాల‌తో ద‌ళం నుంచి బ‌య‌ట‌కు
  • మిగ‌తావారు కూడా బ‌య‌ట‌కు రావాల‌ని కోరిన డీజీపీ

మావోయిస్టు ద‌ళంలో సైద్ధాంతిక విభేదాల కార‌ణంగా తాను పోలీసుల ఎదుట లొంగిపోతున్న‌ట్లు మావోయిస్టు సీనియ‌ర్ నేత జంప‌న్న అలియాస్ న‌ర‌సింహారెడ్డి తెలిపారు. ఆయ‌న భార్య ర‌జిత‌తో క‌లిసి ఆయ‌న ఈ రోజు డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. 33 ఏళ్ల పాటు అడ‌వికే అంకిత‌మైన జంప‌న్న 1984లో పీపుల్స్‌గ్రూప్‌లో దళ సభ్యుడిగా చేరాడు. ఆయ‌న భార్య ర‌జిత కూడా దాదాపు 13 ఏళ్లు ద‌ళంలోనే ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. జంపన్న‌ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అగ్రనేతగా ఎదిగారని, ఆయనపై మొత్తంగా 100 కేసులుండగా.. తెలంగాణలోనే సుమారు 50కి పైగా కేసులున్నాయన్నారు. జంపన్నపై రూ.25 లక్షలు, రజితపై రూ.5 లక్షల రివార్డు ఉందని.. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని వారికి అందజేస్తామని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మావోయిస్టు గ్రూపుల్లో ప‌నిచేస్తున్న వారంద‌రూ ఇలాగే బ‌య‌ట‌కి వ‌స్తే, ప్ర‌భుత్వం వారికి స‌హాయం చేస్తుంద‌ని డీజీపీ హామీ ఇచ్చారు.

అలాగే జంప‌న్న మాట్లాడుతూ... సైద్ధాంతిక కారణాలతోనే తాను విప్లవ ఉద్యమ జీవితాన్ని వ‌దిలి, జనజీవన స్రవంతిలోకి వస్తున్నాన‌ని, త‌న‌పై ఎలాంటి ఒత్తిడి గానీ, బ‌ల‌వంతం గానీ లేద‌ని అన్నారు.

More Telugu News