Harish Rao: 'కాకా' క‌ల‌ను నిజం చేయ‌బోతున్నాం: ప్రాణహిత చేవెళ్ల‌ ప్రాజెక్టు గురించి హ‌రీశ్‌రావు

  • కాళేశ్వరం పూర్తి కావడమే ఆయనకు నివాళి
  • ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల
  • ఈ ప్రాజెక్టు ప్రారంభం కావ‌డం వెంకట స్వామి చలవే
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కాకాకు వెన్నతో పెట్టిన విద్య

ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభం కావ‌డం తెలంగాణ‌ దివంగ‌త నేత‌ వెంకట స్వామి (కాకా) చలవేనని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. అప్ప‌టి ప్ర‌భుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీళ్లు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైను చేశారని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్‌లో జి.వెంకట స్వామి మూడవ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కాబోతోందని, కాకాకు అదే నిజమైన నివాళి అని అన్నారు. గత పాలకులు నీళ్లను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉరుకున్నారని, కాకా మాత్రం వైఎస్సార్‌ని ధిక్కరించారని చెప్పారు. కాకా ఎన్నో పదవులు అధిష్ఠించారని, అయిన‌ప్ప‌టికీ ఆయ‌నలో కొంచం కూడా అహంభావం వుండేది కాదని, సామాన్య ప్రజలు, కార్మికుల తోనే నిరాడంబరంగా తిరిగారని చెప్పారు. శక్తిమంతమైన కార్పొరేట్ లాబీయింగ్ ను తట్టుకొని కార్మికులకు పెన్షన్ పథకం అమలు జరిగేలా పోరాడారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కాకాకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. తెలంగాణ కోసం బులెట్ దెబ్బలు తిన్న వ్యక్తి కాకా అని హరీశ్‌రావు కొనియాడారు.

More Telugu News