Vidarbha: వన్డే క్రికెట్‌లో మరో సంచలనం.. 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసిన బౌలర్!

  • విదర్భ-హరియాణా మ్యాచ్‌లో ఘటన
  • 31 పరుగులకే కుప్పకూలిన హరియాణా
  • 4.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన విదర్భ
  • ఓపెనింగ్ బ్యాట్స్ విమెన్ ఒక్కరే 30 పరుగులు చేసిన వైనం

గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. విదర్భ జట్టు కెప్టెన్ కోమల్ జన్‌జాద్ బంతితో రికార్డులు తిరగరాసింది. ఎనిమిది పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. మొత్తం 9.4 ఓవర్లు వేసిన కోమల్ 5 మెయిడెన్లు తీసుకుని 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకుంది. నిప్పులు చెరిగే కోమల్ బంతులకు హరియాణా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ  జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హరియాణా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏమిటంటే.. విజయానికి అవసరమైన 32 పరుగుల్లో ఓపెనర్ ఎల్ఎం ఇనామ్‌దార్ ఏకంగా 30 పరుగులు చేయడం. మరో ఓపెనర్ కేవలం రెండు పరుగులతోనే సరిపెట్టుకుంది. ప్రతీ ఓవర్‌లో స్ట్రైక్‌ను తనవైపే ఉంచుకుంటూ 18 బంతుల్లో ఏడు ఫోర్లతో 30 పరుగులు చేసింది.

More Telugu News