మహేష్ బాబు: మహేష్ బాబు సినిమా డైలాగ్ తో బీజేపీ నేతకు ఘాటు కౌంటరిచ్చిన టీడీపీ నేత!

  • ఎంత పర్సంట్ కాదు కావాల్సింది వీర్రాజు గారు.. గెలిచామా? లేదా? అనేది ముఖ్యం
  • టీడీపీని ఎక్కడ పెట్టాలి..బీజేపీని ఎక్కడ ఉంచాలనేది ప్రజలే నిర్ణయిస్తారు
  • సోము వీర్రాజు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన టీడీపీ నేత

గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ విజయం కుల శక్తులకు, అవినీతికి అడ్డుకట్ట వేశాయని, కాంగ్రెస్ కు- బీజేపీకి మధ్య 8 శాతం ఓట్లు తేడా ఉన్నాయని, అదే ఏపీలో తమ పార్టీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలిస్తే 2 శాతం ఓట్లు మాత్రమే తేడా తమకు ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడుతూ, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలోని ‘ఎప్పుడొచ్చామనేది కాదు అన్నయ్యా, బులెట్ దిగిందా? లేదా?’ అనే డైలాగ్ ను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా పేరును, హీరో పేరును ప్రస్తావించకుండానే ఆ సినిమాలో డైలాగ్ తరహాలో తనదైన శైలిలో సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏదో సినిమాలో హీరో అంటాడు ‘ఎప్పుడొచ్చామనేది కాదు అన్నయ్యా, బులెట్ దిగిందా? లేదా?’ అని.. అలానే, ఎంత పర్సంట్ కాదు కావాల్సింది వీర్రాజు గారు.. గెలిచామా? లేదా? అనేది ముఖ్యం. ఎవరు ఎలా గెలిచారనే దానిని ప్రజలు చూస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఎలా జరిగాయి? అక్కడ ఏం జరుగుతోంది? ఆంధ్రాలో ఏం జరుగుతోంది? అనేవి పత్రికల్లో, మీడియాలో వస్తున్నాయి. టీడీపీని ఎక్కడ పెట్టాలి? బీజేపీని లేదా ఇంకెవరినైనా ఎక్కడ ఉంచాలనే దానిని అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

More Telugu News