Dirk Nannes: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం!

  • బీపీఎల్‌పై ఆసీస్ పేసర్ ఫిక్సింగ్ ఆరోపణలు
  • స్టేడియంలోనే ఫిక్సర్లు
  • మైక్రోఫోన్లతో జట్ల యజమానులకు ఎప్పటికప్పుడు సమాచారం

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌వైపు మళ్లాయి. యాషెస్‌ సిరీస్‌ ఫిక్సింగ్ అయిందన్న  నేపథ్యంలో స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సుథెర్‌ల్యాండ్ ఆ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపడేశాడు.

అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో మాత్రం స్పాట్ ఫిక్సింగ్ జరుగుతోందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ డిర్క్ నాన్స్ ఆరోపించాడు. కొన్ని విషయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయని పేర్కొన్నాడు. జట్ల యజమానులు మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తున్నారని అన్నాడు. ‘తర్వాత ఏం చేయాలి’ అని జట్ల యజమానులను టీం మేనేజర్లు అడగడం ఇందుకు బలం చేకూరుస్తోందని అన్నాడు.

 వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత నేరుగా కోచ్‌ల వద్దకు వెళ్తున్నారని అన్నాడు. స్టేడియంలోని ప్రేక్షకుల మధ్యలో టీం మేనేజర్లు మైక్రోఫోన్లు, మొబైల్స్‌తో కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడం లేదని విమర్శించాడు. మ్యాచ్‌లు ఫిక్సవుతున్న విషయం స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉందన్నాడు.

ఫిక్సింగ్ చేసుకున్న వాళ్లు ప్రేక్షకుల్లోనే కలిసిపోయి ఉన్నారని, షర్టులో మైక్రోఫోన్, వారి నడుము చుట్టూ పది మొబైల్ ఫోన్లు ఉంటున్నాయని తెలిపాడు. మ్యాచ్‌లో ఏమైనా జరుగుతున్నప్పుడు వారు షర్టు లేపి మైక్రోఫోన్‌లో మాట్లాడుతున్నారని వివరించాడు. కాగా, నాన్స్ 2013లో బీపీఎల్‌లో ఆడాడు. షిల్హెట్ రాయల్స్ తరుపున ఆడిన నాన్స్ 8 మ్యాచుల్లో 8 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలంజెర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు.

More Telugu News