Jayalalitha: జయలలిత కేసులో కొత్త మలుపు.. ఊపిరాడని స్థితిలో తెచ్చారన్న అపోలో ఆసుపత్రుల వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి

  • వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలో ఉన్నారో, లేదో తెలియదు
  • కమిషన్ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి
  • ప్రపంచంలోని అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందించాం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీ శుక్రవారం మరో మలుపు తిరిగింది. జయను ఊపిరాడని స్థితిలోనే ఆసుపత్రికి తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబరు 12  రాత్రి జయ ఊపిరాడని స్థితిలోనే చేరారని తెలిపారు. ‘‘ఊపిరాడని స్థితిలో ఉన్న జయను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తక్షణం సరైన చికిత్స అందించడంతో కోలుకున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగా కాకుండా వేరేలా వచ్చిందన్నారు.

జయలలిత మృతిపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మిస్టరీని ఛేదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జయలలితకు ప్రపంచంలోనే నిపుణులైన వైద్యులతో చికిత్స చేశామని, క్వాలిఫైడ్ నర్సులు, టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్టులు ఆమెను నిరంతరం కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. ఉప ఎన్నిక కోసం వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలో ఉన్నారో, లేదో తనకు తెలియదని ప్రీతారెడ్డి చెప్పడం గమనార్హం.

More Telugu News