చంద్రబాబు: చంద్రబాబుగారూ! మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా? : వైఎస్ జగన్ బహిరంగ లేఖ

  • టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగనీతుల సంగతేంటి?
  • మద్యం తాగుతున్నది అమాయక ప్రజలైనా..తాగిస్తున్నది మీరు
  • మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా?
  • చంద్రబాబుకు రాసిన లేఖలో జగన్ విమర్శలు

‘చంద్రబాబుగారూ! టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగనీతుల సంగతేంటి? పాదయాత్రలో మీరు చెప్పిన ప్రవచనాల సంగతేంటి?’ అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే 24 మద్యం డిపోలుంటే..మరో 9 కొత్త మద్యం డిపోలను ఏర్పాటు చేస్తుండటం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు.

మద్యంపై ఈ ఏడాది రూ.17 వేల కోట్లు సంపాదిస్తున్నారని, గత ఏడాది రూ.13,600 కోట్లు అని, అంటే సగటున ఏటా రూ.15 వేల కోట్లు అని, ఈ విధంగా ప్రజల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఇంత డబ్బు వస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని, రైతు రుణమాఫీకి కేవలం రూ.11 వేల కోట్లే ఇచ్చారని, అసలు మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా అని ప్రశ్నించారు.

‘పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తున్న ముదునూరి సుబ్బమ్మ మృతికి మీరు బాధ్యులు కారా? మీ ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాన్ని తట్టుకోలేక ఆమె గుండెపోటుకు గురై మరణించారనే విషయంలో గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తూ మీరు చేసిన రెండో సంతకం ఏమైంది? మద్యం అమ్మకాలు తగ్గించాలన్నది మా ఉద్దేశం. అలాంటి ఆలోచన మీకు కలగకపోగా, విచ్చలవిడిగా మద్యం అమ్మి కుటుంబాలకు ద్రోహం చేస్తున్నారు. మద్యం తాగుతున్నది అమాయక ప్రజలైనా..తాగిస్తున్నది మీరు. నేరం చేసిన వాడి కంటే చేయించిన వాడికే ఎక్కువ శిక్ష ఉండాలన్న సూత్రం ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా? పద్ధతి మార్చుకోండి చంద్రబాబు గారూ’ అని ఆ లేఖలో వైఎస్ జగన్ విమర్శించారు.

More Telugu News