Amarnath Yatra: అమరనాథ్ యాత్రికులకు షాక్.. గంట కొట్టడం, మంత్రాలు చదవడంపై ఎన్‌జీటీ నిషేధం!

  • జాతీయ హరిత ధర్మాసనం సంచలన ఆదేశాలు
  • వైష్ణోదేవి ఆలయం విషయంలోనూ ఇటువంటి ఆదేశాలే జారీ
  • భక్తుల విస్మయం

హిమగిరుల్లో కొలువైన అమరనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఇది షాకింగ్ న్యూసే. భగవంతుని దర్శించిన తన్మయత్వంలో భక్తులు గంట కొట్టడం, జయజయధ్వానాలు పలకడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇక్కడ ఇకపై అటువంటివి కుదరవు. జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయంలో గంట కొట్టడం, మంత్రాలు చదవడంపై నిషేధం విధించింది. దీనిని అమలు చేయాల్సిందేనని ఆలయ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. యాత్రికులు గుహ వరకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చివరి చెక్ పోస్ట్ దగ్గర డిపాజిట్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌జీటీ  చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ సూచించారు.

అలాగే అమరనాథుడి దర్శనార్థం భక్తులను ఓ వరుస క్రమంలో పంపించాలని ఆదేశించారు. జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయం విషయంలోనూ ఇటీవల ఎన్‌జీటీ ఇటువంటి ఆదేశాలనే జారీ చేసింది. రోజుకు 50 వేలకు మించి భక్తులను అనుమతించవద్దంటూ నవంబరులో ఆదేశించింది. కాగా, హరిత ధర్మాసనం నిర్ణయంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News