Pakistan: మీ గోలలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు?: మోదీపై పాక్ విమర్శల వర్షం

  • గుజరాత్ ఎన్నికల్లో పాక్ కల్పించుకుంటోందన్న నరేంద్ర మోదీ
  • కుట్ర ఆరోపణలేనన్న పాక్ విదేశాంగ శాఖ
  • మోదీ సొంత బలంతో గెలిచే ప్రయత్నం చేయాలన్న మహమ్మద్ ఫైజల్

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సీఎం కావాలని పాకిస్థాన్ కోరుకుంటోందని, అందుకోసం తనవంతు సాయాన్ని చేస్తూ, ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై పాకిస్థాన్‌ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ ఫైజల్ ఓ ట్వీట్ చేస్తూ, ఇండియాలో జరుగుతున్న ఎన్నికల గోలలోకి తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.

"తన సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్‌ను లాగడాన్ని భారత్ మానుకోవాలి. కుట్ర ఆరోపణలను కల్పించి చెప్పే బదులు, సొంత బలంతో మోదీ గెలిచే ప్రయత్నం చేయాలి. ఆయన బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధార ఆరోపణలు చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు పాక్‌ ప్రతినిధులతో ఇటీవల సమావేశమయ్యారని, వారితో చర్చించారని, తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

పాకిస్తాన్‌ మాజీ ఆర్మీ డైరెక్టర్‌ జనరల్‌ సర్దార్‌ అర్షద్‌ రఫీక్‌, అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా గట్టిగానే బదులిచ్చింది. రెండేళ్ల క్రితం అనూహ్యంగా పాక్ లో దిగి, అప్పటి ప్రధాని ఇంటికి వెళ్లి విందు చేసి వచ్చింది మోదీయేనని, ఆయనలా పిలవని పెళ్లికి ఎందుకు వెళ్లారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌ దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు.

More Telugu News