bribe: 2017లో లంచమిచ్చిన సగం మంది ఇండియన్స్!

  • ఏదో ఒక రూపంలో లంచాలిచ్చుకున్న 45 శాతం మంది
  • ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వేలో వెల్లడి
  • పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ లో అధికం!

గడచిన ఏడాది కాలంలో 45 శాతం మంది భారతీయులు ఏదో ఓ రూపంలో లంచాలిచ్చుకున్నారు. 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించి, పలు ఆసక్తి కర అంశాలను ప్రస్తావనకు తెచ్చింది. గడచిన ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తాము లంచం ఇచ్చుకున్నామని 45 శాతం మంది చెప్పారు.  గత సంవత్సరం ఇదే సర్వేలో లంచమిచ్చామని చెప్పిన వారు 43 శాతమే. ఇక, లంచగొండితనం పెరిగిందని 37 శాతం మంది (సర్వేలో పాల్గొన్న వారిలో 34,696 మంది), తగ్గిందని 14 శాతం మంది వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లోని 71 శాతం మంది, మధ్య ప్రదేశ్ లోని 70 శాతం మంది తమ రాష్ట్రంలో లంచాలు పెరిగిపోయాయని చెప్పడం గమనార్హం.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 18 శాతం మంది లంచాలు పెరిగాయని వ్యాఖ్యానించగా, 64 శాతం మంది ఎలాంటి మార్పూ లేదన్నారు. ఢిల్లీలో 33 శాతం మంది లంచగొండితనం పెరిగిందని చెప్పగా, 38 శాతం మంది మార్పులేదని అన్నారు. యూపీలో సైతం 21 శాతం మంది తాము మరింతగా లంచాలు ముట్టజెప్పాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. స్థానిక స్థాయిలో లంచావతారుల సంఖ్య పెరిగినట్టు తమ సర్వేలో వెల్లడైందని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి పంకజ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక కార్యాలయాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో డబ్బివ్వనిదే పని కావడం లేదని 84 శాతం మంది చెప్పారని, మునిసిపల్, పోలీస్, టాక్స్, విద్యుత్, ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర విభాగాల్లో లంచాలు అధికమని తెలిపారు.

More Telugu News