Rains: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు!

  • తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం
  • సాయంత్రానికి మరింత బలహీనపడే అవకాశం
  • వర్షం ముప్పు తప్పిందన్న వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళా ఖాతంలో ఏర్పడి, ఒడిశా తీరం దిశగా వెళ్లిన వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిపోయింది. ఇదిప్పుడు ఈశాన్యంగా ప్రయాణిస్తూ, నేటి సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తాయని భావించిన వర్షాలు ఇక పడే అవకాశం లేదని తెలిపారు. వచ్చే ఇరవై నాలుగు గంటలూ వాతావరణం పొడిగా వుంటుందని, తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే, తక్కువగా నమోదవుతాయని వెల్లడించారు.

కాగా, ఆదిలాబాద్‌ లో అత్యల్పంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అరకు లోయలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోయింది. ఇక వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుసుకున్న ఉత్తర కోస్తా రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News