పవన్ కల్యాణ్: కాపులు నాకు దగ్గర కాదు.. కమ్మవారు నాకు దూరం కాదు!: పవన్ కల్యాణ్

  • నువ్వు కమ్మ, నేను కాపు.. బీసీ, ఎస్టీ, దళిత్.. ’ వీటిని దాటాలి
  • అవమానం జరిగినా కూడా కులాలను దాటి వెళ్లాలి
  • పవన్ కల్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం

నువ్వు మనిషివా? మంచోడివా? అనేదే తనకు కావాలి తప్పా, కులం, మతం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా జూనియర్ .. స్నేహితుడు ఒకడు కుల సమస్యతో బాధపడ్డాడు. ఈ రోజుకీ అలాంటి పరిస్థితే ఉంది. నేను ఒక కులం గురించి చెప్పట్లేదు. ఈరోజుకీ విజయవాడ ఇంకా మారలేదు. ఈ విషయాన్ని మనందరం ఆలోచించాలి.

ఒక ఉదాహరణ చెబుతా.. హైదరాబాద్ నుంచి ఇక్కడ సెటిల్ అవుదామని కొందరు ఇక్కడికి వచ్చారు. అందులో ఒకతను ఆరు నెలలు ఉండి, తిరిగి తన పిల్లలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘ఎందుకు వెళ్లి పోయావు?’ అని అతన్ని అడిగితే.. ‘మా పిల్లలు స్కూల్ కు వెళితే.. ‘మీ కులం’ ఏంటని అడుగుతున్నారండి. నాకు ఇబ్బందిగా ఉంది. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు జరగలేదు. విజయవాడలో ఇబ్బందిగా ఉంది’ అని చెప్పాడు’ అని పవన్ పేర్కొన్నారు.

‘పాతికేళ్లలో ఆకాశహర్మ్యాలు వచ్చాయి. ఫ్లై ఓవర్లు వచ్చాయి గానీ, ఇక్కడి వాళ్లు మాత్రం ఇంకా ఆ కులం ఉచ్చుల్లోనే ఇరుక్కుపోయారు. ‘నువ్వు కమ్మ, నేను కాపు.. బీసీ, ఎస్టీ, దళిత్.. ’ వీటిని దాటాలి.. కులాల మధ్య ఐక్యత ఉండాలి. దేశం, సమాజం సుభిక్షం కోనం మనకు అవమానం జరిగినా కూడా కులాలను దాటి వెళ్లాలి.. వెళితేనే మార్పు సంభవిస్తుంది.

నువ్వు మనిషివా? మంచోడివా? నాకు కావాల్సింది అదే, కులం, మతం కాదు. నాకు క్రిస్టియన్లు ఒకటి, ముస్లింలు మరోటి, హిందువులు ఇంకోటి కాదు. కాపులు నాకు దగ్గర కాదు, కమ్మవారు నాకు దూరం కాదు, అందరూ ఒకటే. ఒక కమ్మ ఆడపడుచుకు అన్యాయం జరిగినా నాకు ఏడుపొస్తుంది. తప్పు చేసిన వాళ్లనే శిక్షించండి, అంతే కానీ, ఆ తప్పును మొత్తం ఒక వర్గానికి, సమాజానికి అంటగట్టకండి’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

‘గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, మిగతా 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ సమాజం మారాలి. కులాల నుంచి బయటపడాలి. తెలంగాణ సమాజంలో ఇంత కులవివక్ష లేదు. కులంతో కొట్టుకోరు. వాళ్లకు తెలంగాణ అభిమానం ఉంది. మనకు కులాభిమానం ఉంది. కులం కూడుపెడుతుందా? డబ్బుంటేనే కులం. అది లేకపోతే, మనం పేదవాళ్లమైనా పట్టించుకోరు. అన్ని కులాలకు, మతాలకు న్యాయం జరగాలంటే మనలో వివక్ష ఉండకూడదు. అందుకే, నా జీవితంలో ఎప్పుడూ కులం అనే దానిని పెట్టుకోలేదు. నా కుటుంబం అనే భావన కూడా నాకు లేదు, అందుకే చిరంజీవి గారిని వదిలి వచ్చేశాను’ అని పవన్ కల్యాణ్ స్ఫూర్తి దాయకంగా ప్రసంగించారు.

More Telugu News