Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. రాహుల్ బాధ్యత స్వీకరణ అనంతరం కీలక చర్యలు!

  • టీకాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులకు రాహుల్ యోచన
  • సీడబ్ల్యూసీలోకి పలువురు రాష్ట్ర నేతలు
  • రేవంత్‌కు కీలక పదవి
  • విజయశాంతి, కోమటిరెడ్డికి ముఖ్య బాధ్యతలు

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు తథ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన మరుక్షణం టీకాంగ్రెస్‌ను సంస్థాగతంగా రిపేర్ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు.  

రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, సీనియర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే చర్యలు తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా సమర్థులైన, సత్తా ఉన్నా నాయకులకు తగిన బాధ్యతలు అప్పగించాలని ఆయన యోచిస్తున్నట్టు అధిష్ఠాన పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.


కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకోనున్నట్టు సమాచారం. సీనియర్ నేతగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని రాహుల్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలైన పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వీహెచ్, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటి వారికి ఇప్పటికే ఏఐసీసీలో బాధ్యతలు ఉండగా, త్వరలో వీరికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రస్థాయిలో మరికొందరు నేతలను కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు.  

సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి తగిన గౌరవం ఇవ్వడంతోపాటు అసంతృప్త నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని ఏఐసీసీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరితో మాట్లాడినట్టు సమాచారం. ఇక ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో ముఖ్య పదవి కట్టబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే టీపీసీసీ సమన్వయ కమిటీలో సత్తాలేని నేతలను సాగనంపి, సత్తా ఉన్న వారికి అవకాశం కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని ఏఐసీసీ కృతనిశ్చయంతో ఉన్నట్టు జాతీయ నేతలు చెబుతున్నారు.

More Telugu News