TTD: 'వడ్డి' కాసుల వాడి మహా వైభోగం... వందల కోట్లకు చేరిన వడ్డీ ఆదాయం!

  • వెంకన్న వడ్డీ ఆదాయం రూ. 766 కోట్లు 
  • వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్ల డిపాజిట్లు
  • రోజువారీ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు 
  • శాసనమండలికి తెలిపిన టీటీడీ

కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరునికి వివిధ బ్యాంకుల్లోని డిపాజిట్లపై వచ్చే ఆదాయం రూ. 766 కోట్లకు పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శాసనమండలి హామీల కమిటీకి ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, స్వామివారి పేరిట బ్యాంకుల్లో రూ. 7,359 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇక, రెండేళ్ల క్రితం దర్శన టికెట్ల కొనుగోళ్ల రూపంలో రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అది రూ. 256 కోట్లకు పెరిగింది. మొత్తం వార్షికాదాయం రూ. 2,858 కోట్లని, భక్తులు సమర్పించే హుండీ కానుకల ఆదాయం నిత్యమూ రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.

 మొత్తం ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, వారికి ప్రోత్సాహకాలు ఇత్యాది వ్యయాలకే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని తెలిపింది. స్వామివారి పేరిట విజయా బ్యాంకులో రూ. 2,938 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో రూ. 1,965.01 కోట్లు, సిండికేట్‌ బ్యాంకులో రూ. 945.37 కోట్లు, స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 938.06 కోట్లు, కెనరా బ్యాంకులో రూ. 298.10 కోట్లు ఉన్నాయని, వీటితో పాటు మరికొన్ని చిన్న బ్యాంకుల్లోనూ డిపాజిట్లు ఉన్నాయని హామీల అమలు కమిటీకి టీటీడీ నివేదిక ఇచ్చింది.

More Telugu News