kakatiya: కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ క్యాంప‌స్‌లో మ‌ద్య‌పానం... 22 మంది విద్యార్థుల సస్పెన్ష‌న్

  • పుట్టిన రోజు పేరుతో ఫుల్‌గా తాగిన విద్యార్థులు
  • క్యాంప‌స్‌లో డ్ర‌గ్స్‌?
  • ఖండించిన యాజ‌మాన్యం

వరంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ చ‌దువుతున్న 22 మంది విద్యార్థులు క్యాంప‌స్‌లో మందుకొట్టి ప‌ట్టుబ‌డ్డారు. వారిని కాలేజీ యాజ‌మాన్యం డిసెంబ‌ర్ 4 వ‌ర‌కు స‌స్పెండ్ చేసింది. స్నేహితుడి పుట్టిన‌రోజు వంక‌తో విద్యార్థులు మద్య‌పానం చేసి హాస్ట‌ల్‌కి రాగా, వాచ్‌మెన్ గుర్తుప‌ట్టి ప్ర‌ధానోపాధ్యాయునికి స‌మాచార‌మిచ్చాడు. ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌ధానోపాధ్యాయుడు డా. వి. చంద్ర‌శేఖ‌ర్ వారిని సస్పెండ్ చేశారు.

అయితే ఈ పార్టీలో విద్యార్థులు గంజాయి తీసుకున్న‌ట్లుగా కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిలో ఎలాంటి నిజం లేద‌ని కాలేజీ యాజ‌మాన్యం ఖండించింది. పుట్టిన‌రోజు జ‌రుపుకున్న విద్యార్థి గ‌దిని తాను స్వ‌యంగా సంద‌ర్శించాన‌ని, అక్క‌డ గంజాయి వాడిన‌ట్లుగానీ, దాచిన‌ట్లుగానీ ఆన‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. విద్యార్థులు కేవ‌లం మ‌ద్యం మ‌త్తులో అల్ల‌రి చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో స్థానిక‌ ఎన్ఐటీ విద్యార్థుల వ‌ద్ద డ్ర‌గ్స్ దొరికిన నేప‌థ్యంలో ఈ విష‌యం గురించి మ‌రింత స‌మాచారం రాబ‌ట్టేందుకు క‌మిటీ వేసిన‌ట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

More Telugu News