UNO: యుద్ధమే అనివార్యమైతే సర్వనాశనమే: అమెరికా తీవ్ర హెచ్చరిక

  • కిమ్ ను నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు
  • వాటిల్లో భాగంగానే సైనిక చర్య
  • అదే జరిగితే ఆ దేశం సమూలంగా నాశనమే
  • ఐరాసలో హెచ్చరించిన నిక్కీ హేలీ

ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఉత్తర కొరియా అధినేత యుద్ధాన్ని కోరుకుంటున్నట్లు అనిపిస్తోందని, యుద్ధమే వస్తే సర్వనాశనం తప్పదని, ఉత్తర కొరియా నామరూపాల్లేకుండా పోతుందని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. నార్త్ కొరియా వరుస ఖండాంతర క్షిపణుల ప్రయోగాలను తీవ్రంగా పరిగణిస్తూ, కిమ్ ను నిలువరించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నామని, వాటిల్లో భాగంగానే సైనిక చర్య గురించి కూడా ఆలోచిస్తున్నామని, యూఎస్ అంబాసిడర్ నిక్కీ హేలీ ఐరాస కౌన్సిల్ సమావేశంలో వ్యాఖ్యానించారు.

 ఉత్తర కొరియా వెంటనే తన దుందుడుకు వైఖరిని ఆపకుంటే, పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. "ఉత్తర కొరియాతో యుద్ధాన్ని మేము ఈ రోజు వరకూ కోరుకోవడం లేదు. యుద్ధమే వస్తే మాత్రం, మరో తప్పు జరగకుండా ఉత్తర కొరియా దేశం సమూలంగా నాశనమవుతుంది" అని ఆమె అన్నారు. ఉత్తర కొరియాకు ముడి చమురు సరఫరాను చైనా తక్షణం నిలిపివేయాలని నిక్కీ హేలీ డిమాండ్ చేశారు. కాగా, కొరియా రెచ్చగొట్టే ధోరణులపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడామని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

More Telugu News