Hyderabad: ప్రారంభానికి ముందే హైద‌రాబాద్ ప‌ట్టాల‌పై 3 ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు తిరిగిన మెట్రో రైళ్లు!

  • మూడేళ్ల క్రితం ప్రారంభ‌మైన ట్ర‌య‌ల్ ర‌న్‌
  • తొలుత నాగోల్ నుంచి ఎన్‌జీఆర్ఐ వ‌ర‌కు మూడు కిలోమీట‌ర్ల‌తో ప్రారంభం
  • నేటి నుంచి అధికారికంగా ప‌రుగు

హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి మ‌రికొన్ని గంట‌ల సమయమే ఉంది. ఈ మ‌ధ్యాహ్నం నుంచి మెట్రో ప‌రుగు మొద‌లు కానుంది. ప్ర‌యాణానికి ఎప్పుడో సిద్ధ‌మైన న‌గ‌ర‌వాసులు ఆ శుభ‌ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రారంభానికి శ‌ర‌వేగంగా ఏర్పాట్లు చేసిన మెట్రో అధికారులు అందులో భాగంగా కొన్ని నెల‌లుగా రైళ్ల‌కు ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తున్నారు.

ఇక ఈ ట్ర‌య‌ల్‌ ర‌న్‌లో భాగంగా రైళ్లు తిరిగిన దూరం ఎంతో తెలుసా? అక్ష‌రాలా మూడు ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు. భాగ్య‌న‌గ‌రంలోని మూడు కారిడార్లలో 72 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మెట్రో రైళ్ల‌ను న‌డిపేందుకు రెండేళ్ల క్రిత‌మే 57 రైళ్ల‌ను కొరియా నుంచి దిగుమ‌తి చేసుకున్నారు. అందులో రెండింటిని నాగ్‌పూర్‌ మెట్రోకు అద్దెకు ఇవ్వ‌గా ప్ర‌స్తుతం 55 ఉన్నాయి. నేడు మెట్రో ప్రారంభం  కానుండగా, 30 కిలోమీట‌ర్ల మార్గంలో 18 రైళ్లు కూత‌కు సిద్ధ‌మ‌య్యాయి.

ఆగ‌స్టు 7, 2014న తొలిసారి ట్రయ‌ల్ ర‌న్ ప్రారంభం కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 3 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ట్ర‌య‌ల్ ర‌న్ పూర్తి చేసుకున్నాయి. తొలుత నాగోల్ నుంచి ఎన్జీఆర్ఐ వ‌ర‌కు మూడు కిలోమీటర్లతో మెట్రో ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభమైంది. అక్టోబ‌రు 24, 2015లో మియాపూర్‌-ఎస్ఆర్ న‌గ‌ర్ మ‌ధ్య ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభించారు. ఆ త‌ర్వాత మెట్టుగూడ నుంచి ఎస్ఆర్‌న‌గ‌ర్ వ‌ర‌కు నిర్మాణ ప‌నులు పూర్తి కావ‌డంతో ఈ 30 కిలోమీట‌ర్ల  ప‌రిధిలో గ‌త వారం రోజులుగా ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తున్నారు. గ‌త 39 నెల‌లుగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్ర‌య‌ల్ ర‌న్స్ జ‌రు‌గుతున్నాయి. అధికారికంగా ప్రారంభం కాకుండానే మెట్రో రైళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 3 ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు ప‌రుగులు పెట్టిన‌ట్టు మెట్రో అధికారులు తెలిపారు.

More Telugu News