Giddi Eshwari: నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న గిడ్డి ఈశ్వ‌రి.. మ‌రో 60 మంది కూడా..!

  • ఈశ్వరితోపాటు మ‌రో 60 మంది టీడీపీలోకి
  • పాడేరు నుంచి 25 వాహనాల్లో ఏపీ రాజ‌ధానికి
  • సీఎం స‌మ‌క్షంలోనే మాట్లాడ‌తాన‌న్న పాడేరు ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. ఆమెతోపాటు దాదాపు 60 మంది ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు, ఇత‌ర నేత‌లు టీడీపీలో చేరనున్నారు. ఈమేర‌కు ఆదివారం సాయంత్రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 25 వాహనాల్లో అమ‌రావ‌తికి బ‌య‌లుదేరారు. ఎమ్మెల్యే ఈశ్వ‌రి, ఆమె గురువు గోవింద‌రావు త‌దిత‌రులు మ‌రో రెండు వాహ‌నాల్లో బ‌య‌లుదేరారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాక‌రించిన ఈశ్వ‌రి ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో అన్ని విష‌యాలు మాట్లాడ‌తాన‌ని తెలిపారు.

గిడ్డి ఈశ్వరి చేరిక‌తో ఏజెన్సీలో టీడీపీ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అర‌కు లోక్‌స‌భ‌, పాడేరు, అర‌కులోయ అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత ఇప్ప‌టికే వైసీపీకి దూరంగా ఉండ‌గా, అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు గ‌తేడాది టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ ఇక్క‌డ దాదాపు ఖాళీ అయింది. కాగా, విజ‌య‌సాయిరెడ్డి తీరుతోనే తాను పార్టీ మారుతున్న‌ట్టు ఈశ్వ‌రి ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈశ్వ‌రి పార్టీ మార‌కుండా ఆపేందుకు జ‌గ‌న్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

More Telugu News