suresh gopi: 'మీరే ముఖ్య అతిథిగా పాల్గొనాలి' అంటూ చంద్రబాబును తన స్వగ్రామానికి ఆహ్వానించిన మలయాళ నటుడు సురేష్ గోపీ!

  • పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సురేష్ గోపీ
  • అమరావతిలో చంద్రబాబుతో భేటీ
  • ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కళ్లియార్ లో జరుగనున్న బనానా ఫెస్టివల్‌ కి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తన స్వగ్రామంలో జరిగే బనానా ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా కోరుతూ ప్రముఖ మలయాళ సినీ నటుడు సురేష్‌ గోపి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లి, సచివాలయంలో చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ, 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు బనానా ఫెస్టివల్‌ తిరువనంతపురం సమీపంలోని తన సొంత గ్రామమైన కళ్లియార్ లో జరగనుందని తెలిపారు.

ఈ అరటి పండుగలో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అరటి రైతులు పాల్గొంటారని, దీనికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తామని సురేష్ గోపీ తెలిపారు. ఈ వేడుకలో 457 రకాల అరటి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, డబ్బింగ్ సినిమాలతో సురేష్ గోపీ తెలుగు సినీ అభిమానులకు సుపరిచితుడే. ఆయన ధరించిన పోలీస్ పాత్ర ప్రధానంగా నడిచే పలు చిత్రాలు మలయాళం నుంచి తెలుగుకు డబ్బింగయ్యాయి.

More Telugu News