YSRCP: ఫలించని జగన్ యత్నాలు.. 27న టీడీపీలోకి గిడ్డి ఈశ్వరి?

  • పార్టీలో తనకు తీవ్ర అన్యాయం  జరిగిందని ఈశ్వరి మనస్తాపం
  • తానెందుకు పార్టీ మారాలనుకుంటున్నదీ అనుచరులకు వివరణ
  • అధిష్ఠానం హామీలకు ససేమిరా

వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి  ఈశ్వరి టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన ముఖ్య నేతలతో సమావేశమైన ఈశ్వరి మాట్లాడుతూ పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లు కష్టపడి పాడేరు, అరకులోయలో పార్టీని నిలబెట్టానని, అయినా పార్టీలో తనకు సరైన గుర్తింపులేదని అన్నారు.

తనపై అధిష్ఠానం అవలంబిస్తున్న వైఖరి సరిగా లేదని, అధినేత జగన్, విజయసాయిరెడ్డి తన ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశారని వాపోయారు.  ఈ సందర్భంగా పార్టీ ఎందుకు మారాల్సి వస్తోందన్న విషయాన్ని వివరించారు. తాను టీడీపీలో చేరడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని వున్నా తన ప్రమేయం లేకుండా ఏజెన్సీలోని ఇతరులను పార్టీలోకి ఆహ్వానిస్తుండడంతో మనస్తాపానికి గురయ్యానని ఈశ్వరి అన్నారు.

గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, బొత్సలను పురమాయించి ఆమెను ఆపాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఈశ్వరికి వారు ఫోన్లు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఈనెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈశ్వరి టీడీపీలో చేరనున్నట్టు ఆమె వర్గీయుల ద్వారా తెలుస్తోంది.

More Telugu News