padmavati: 'పద్మావతి'కి యూకేలో గ్రీన్ సిగ్నల్.. విడుదల చేయబోమన్న నిర్మాతలు

  • డిసెంబర్ 1న విడుదల చేసుకోవచ్చన్న యూకే సెన్సార్ బోర్డ్
  • విడుదలకు ఆసక్తి చూపని నిర్మాతలు
  • ఇండియాలో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విడుదల అంటూ స్పష్టీకరణ

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' సినిమా విడుదలకు యూకే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమాకు 'యూ' రేటింగ్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీన విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఆ రోజున యూకేలో విడుదల చేయడానికి 'పద్మావతి' నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఇండియన్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు బ్రిటీష్ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోమని వారు స్పష్టం చేశారు.

'పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితర స్టార్లు ఈ సినిమాలో నటించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా, అంతర్జాతీయంగా పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఈ చిత్రంలో పద్మావతిని అగౌరవపరిచే రీతిలో చూపించారనే ఆరోపణలతో రాజ్ పుత్ లు సినిమా విడుదలను అడ్డుకుంటున్నారు. సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి బీజేపీ నుంచి కూడా మద్దతు ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో ఈ సినిమాపై నిషేధం విధించారు.

More Telugu News