vishal: అశోక్ ది ఆత్మహత్య కాదు.. హత్య!: హీరో విశాల్ సంచలన లేఖ

  • అశోక్ మరణాన్ని హత్యగానే పరిగణించాలి
  • ఫైనాన్షియర్ల దురాగతాలు ఎక్కువవుతున్నాయి
  • తమిళ సినీ పరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోంది

తమిళనాడులో జరిగే ప్రతి చిన్న విషయంపై హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ వెంటనే స్పందిస్తాడనే విషయం తెలిసిందే. తాజాగా తమిళ నిర్మాత అశోక్ ఆత్మహత్యపై ఆయన ఓ లేఖ రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అశోక్ ది ఆత్మహత్య కాదని, హత్య అని లేఖలో ఆరోపించాడు.

ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్ల అశోక్ ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని చెప్పాడు. అప్పుల బాధను తట్టుకోలేక చేసుకునే ఆత్మహత్యల్లో ఇదే చివరిది కావాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. ఫైనాన్షియర్ల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరాడు.

ఫైనాన్షియర్ల వేధింపులకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని విశాల్ చెప్పాడు. నిర్మాతల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలసికట్టుగా పని చేయాలని కోరాడు. అమాయకుల మరణాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశాడు.

దీన్ని ఆత్మహత్యగా కాకుండా, హత్యగా పరిగణించాలని కోరాడు. ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి నిర్మాతలను, వారి కుటుంబ సభ్యులను హింసించవద్దని ఫైనాన్షియర్లకు వార్నింగ్ ఇచ్చాడు. తమిళ సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న ఓ చెడు సంస్కృతికి ఇది ఒక నిదర్శనమని చెప్పాడు. 

More Telugu News