kamineni sreenivas: శాసనమండలిలో మంత్రి కామినేని, గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య మాటల యుద్ధం

  • డెంగ్యూ, అంటు వ్యాధులతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోంది
  • మెడాల్ కంపెనీ పేరుతో భారీ స్కాం జరిగిందన్న గాలి
  • సంబంధం లేని విషయాలను అడుగుతున్నారన్న కామినేని

ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య మాటల తూటాలు పేలాయి. డెంగ్యూ, అంటు వ్యాధులతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోందని... అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదని గాలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జిల్లాలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో చెన్నై, బెంగళూరుకు ప్రజలు వెళుతున్నారని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి గత 9 ఏళ్లుగా ఈ జిల్లాలోనే పని చేస్తున్నారని... ఉపాధ్యాయులను కూడా రెండు మూడేళ్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని... గత తొమ్మిదేళ్లుగా ఆమెను ఇదే జిల్లాలో ఎందుకు ఉంచారని మంత్రిని గాలి ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెడాల్ అనే కంపెనీకి అప్పగించారని... మెడాల్ పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారని గాలి ఆరోపించారు.

దీనిపై మంత్రి కామినేని స్పందిస్తూ, సంబంధం లేని విషయాలను ఎలా అడుగుతారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖపై నిన్న సభలో చర్చ జరిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా... ఇప్పుడు మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు.

More Telugu News