కుర్తా ధ‌రించి క‌చేరీ ఇచ్చిన బ్రిట‌న్ సింగ‌ర్ ఎడ్ షీర‌న్‌!

20-11-2017 Mon 15:12
  • ముంబైలో ఆదివారం జ‌రిగిన కాన్స‌ర్ట్‌
  • అభిమానుల‌ను అల‌రించిన గాయ‌కుడు
  • ప్ర‌త్యేక పార్టీ ఇచ్చిన ఫ‌రా ఖాన్‌

'షేప్ ఆఫ్ యూ', 'ప‌ర్‌ఫెక్ట్‌', 'ఎరేజ‌ర్', 'బ్ల‌డ్ స్ట్రీమ్' వంటి హిట్ పాట‌లను అందించిన బ్రిట‌న్ గాయ‌కుడు ఎడ్ షీర‌న్ ముంబైలో ఆదివారం రాత్రి కాన్స‌ర్ట్ నిర్వ‌హించాడు. ఇందులో భాగంగా నీలి రంగు కుర్తా ధ‌రించి భార‌త సంప్ర‌దాయ దుస్తుల్లో అభిమానుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో గార్డెన్స్‌లో జ‌రిగిన ఈ ఈవెంట్‌కి దాదాపు 10 వేల మంది అభిమాను‌లు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

కాగా, కాన్స‌ర్ట్‌కి ముందు బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కురాలు ఫ‌రాఖాన్‌, ఎడ్ షీర‌న్‌కి ప్ర‌త్యేకంగా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి షారుక్ ఖాన్‌, నేహా ధూపియా, షాహిద్ క‌పూర్‌, మీరా క‌పూర్‌, మ‌లైకా అరోరా‌, ర‌వీనా టాండ‌న్‌ స‌హా చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ పార్టీలో ఫ‌రాతో క‌లిసి ఎడ్ షీర‌న్ స్టెప్పులు వేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.