Raghuveera Reddy: వామపక్షాల ‘చలో అసెంబ్లీ’కి కాంగ్రెస్ మద్దతు: రఘువీరారెడ్డి

  • వామపక్షాల చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
  • రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్న ఏపీసీసీ చీఫ్
  • ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ రోజు వామపక్షాలు నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు అవుతున్నా కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ హామీల గురించి ప్రశ్నించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చేయడం లేదన్నారు. చంద్రబాబు తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు.

రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి చలో అసెంబ్లీని నిర్వహిస్తున్నామని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
Raghuveera Reddy
APCC
Chandrababu

More Telugu News