Uttar Pradesh: పిల్లాడని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ, టార్చర్ పెట్టిన యూపీ పోలీసులు... వీడియో వెలుగులోకి!

  • యూపీలోని మహరాజ్ గంజ్ జిల్లాలో ఘటన
  • బాలుడు ప్రాధేయపడుతున్నా వినని పోలీసులు
  • తొడలపై లాఠీలు పెట్టి ఎక్కి నిలుచున్న వైనం
  • వీడియో వైరల్ కావడంతో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ 

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, ఇద్దరు పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ దొంగతనం ఆరోపణలపై టీనేజ్ పిల్లాడిని స్టేషన్ కు తెచ్చిన పోలీసులు, స్టేషన్ ఆవరణలోనే అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలుడు ప్రాధేయపడుతున్నా వినకుండా ఈ ఇద్దరు పోలీసులు చావ బాదుతున్న దృశ్యాలు, లాఠీలతో కుళ్లబొడుస్తుంటే, తనను కొట్టవద్దని బాలుడు ఏడుస్తున్న దృశ్యాలూ ఇందులో ఉన్నాయి.

బాలుడి రెండు తొడలపై ఓ లాఠీ పెట్టి, దానిపై ఇద్దరూ ఎక్కి నిలబడ్డారు. ఏ మాత్రం జాలీ, దయా లేకుండా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరిని ఎవరు వీడియో తీశారన్న విషయమై స్పష్టత లేకపోయినా, పనియారా జిల్లాలో ఇది జరిగిందని, ఉన్నతాధికారులు తేల్చారు. ఈ ఘటనపై విచారించి సబ్ ఇన్ స్పెక్టర్ కేెఎన్ షాహి, మరో పోలీసును సస్పెండ్ చేశామని వెల్లడించారు. అతను దొంగతనం చేశాడని భావిస్తున్న వస్తువుల రికవరీ కోసమే పోలీసులు అలా ప్రవర్తించారని, అయితే, అతని వద్ద ఏ వస్తువూ లభించలేదని అడిషనల్ ఎస్పీ అశుతోష్ శుక్లా వెల్లడించడం గమనార్హం.

More Telugu News