uma madhavareddy: కేసీఆర్ ను కలిసిన ఉమా మాధవరెడ్డి.. టీడీపీ పని అయిపోయిందంటూ కామెంట్!

  • గతంలో టీఆర్ఎస్ లో చేరమని ఆహ్వానం అందింది
  • ఇప్పుడు మళ్లీ ఆహ్వానిస్తే ఆలోచిస్తా
  • హామీ ఇవ్వకుండానే కాంగ్రెస్ ఎందుకు చేరుతా

టీటీడీపీ నాయకురాలు ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలో కలిశారు. నక్సలైట్ల చేతిలో మరణించిన నేతలకు ఇచ్చే ఇంటిస్థలంకు సంబంధించి సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి హామీ లేకుండానే కాంగ్రెస్ లో చేరడానికి తానేమన్నా పిచ్చిదాన్నా? అని అన్నారు. హామీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితో పాటే ఢిల్లీ విమానం ఎక్కి ఉండేదాన్నని చెప్పారు. రేవంత్ కు పదవిపై కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చి ఉండవచ్చని తెలిపారు.

టీఆర్ఎస్ లోకి రావాలంటూ తనకు గత ఎన్నికల సమయంలోనే ఆహ్వానం వచ్చిందని, అయితే అప్పుడు తాను పార్టీ మారలేదని ఉమా మాధవరెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ లోకి రావాలంటూ తనను ఎవరూ అడగడం లేదని... ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఏ పార్టీలో అయినా తన కుమారుడి వెంటే ఉంటానని అన్నారు. ఒంటరిగా కేసీఆర్ ను కలిస్తే టీఆర్ఎస్ లో చేరుతున్నాననే ప్రచారం జరుగుతుందని... అందుకే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వెళ్లానని, అందరూ చూస్తుండగానే ఆయనకు వినతిపత్రం అందించానని చెప్పారు. 

More Telugu News