team india: క్రికెట్ అప్ డేట్స్: రాణించిన శ్రీలంక.. లక్మల్: 6 ఓవర్లు, 6 మెయిడిన్లు,3 వికెట్లు

  • 11.5 ఓవర్లు జరిగిన తొలి రోజు ఆట
  • మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • భారత్ నడ్డి విరిచిన లక్మల్

కోల్ కతాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బలహీన శ్రీలంక జట్టు ముందు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచిన శ్రీలంక భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అంతకు ముందు వర్షం వల్ల మధ్యాహ్నం వరకు మ్యాచ్ ప్రారంభమే కాలేదు. ఆ తర్వాత మ్యాచ్ ను వర్షం పలుమార్లు అడ్డుకుంది. తొలి రోజు ఆటలో కేవలం 11.5 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. కానీ, ఈ లోగానే టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు శ్రీలంక బౌలర్ లక్మల్.

కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లు టీమిండియా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు రాహుల్. అనంతరం 8 పరుగులు (11 బంతులు) చేసిన ధావన్ లక్మల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ 11 బంతులను ఎదుర్కొని లక్మల్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్ లక్మల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆరు ఓవర్లు వేసిన లక్మల్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీశాడు.  

More Telugu News