epidrin: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!

  • బొల్లారంలోని ఓ కంపెనీలో పట్టుబడ్డ డ్రగ్స్
  • 179 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం
  • దీని విలువ రూ. 5 కోట్లని అంచనా
  • రియాక్టర్ ను లీజుకు తీసుకుని దందా

టాలీవుడ్ లో సంచలనంగా మారి, తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ దందాను పూర్తిగా మరువకముందే సంగారెడ్డిలో మరో భారీ డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. తమకందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, 179 కిలోల ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బొల్లారంలో ఓ కంపెనీ కేంద్రంగా ఈ దందా సాగుతోందని, దాడుల అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. వారిని విచారించిన తరువాత మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు.

కాగా, ఇదే ప్రాంతంలో గతంలోనూ డ్రగ్స్ వెలుగుచూడటం గమనార్హం. ఈ కంపెనీకి ఎటువంటి పేరూ లేదని, 15 రోజుల పాటు కంపెనీలోని రియాక్టర్ ను రూ. 2 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్న వ్యక్తులు, ఎపిడ్రిన్ ను తయారు చేశారని పేర్కొన్నారు. ఎపిడ్రిన్ తో పాటు మెటామిథామైన్ ను కూడా వీరు తయారు చేస్తున్నారని తెలిపారు. రానున్న నూతన సంవత్సరం వేడుకలు లక్ష్యంగా వీరు ఈ దందా మొదలు పెట్టినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు అధికార వర్గాల సమాచారం.

More Telugu News