Hardik Patel: సెక్స్ సీడీ అయిపోయింది.. ఇక ఇప్పుడు వేధింపుల కేసులో ఇరికిస్తారేమో!: హార్ధిక్ పటేల్

  • నేను తప్పు చేస్తే చంపేయండి
  • నేను చేస్తున్న ఉద్యమం నా కోసం కాదు
  • ఐఏఎస్, ఐపీఎస్‌ల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగలేదనే ఇవన్నీ చేస్తున్నారు! 

పటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సరికొత్త సందేహాన్ని వ్యక్తం చేశాడు. సెక్స్ సీడీలు అయిపోయాయి కాబట్టి ఇక తనను వేధింపుల కేసులో ఇరికించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. హార్ధిక్‌ ఉన్నట్టుగా చెబుతున్న దాదాపు అరడజను సెక్స్ వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశాడు.

‘‘నేనేమైనా తప్పు చేస్తే తొలుత నన్ను చంపేయండి. నా ఉద్యమం నాకోసం కాదు. పటీదార్ హక్కుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం’’ అని భరూచ్‌లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో హార్ధిక్ వ్యాఖ్యానించాడు. ‘‘రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపకపోతే సెక్స్ వీడియోలను విడుదల చేసి, నా ప్రతిష్ఠను దెబ్బతీస్తామని కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నన్ను గతంలో హెచ్చరించారు. వారి బ్లాక్‌మెయిలింగ్‌కు నేను లొంగలేదు. అందుకే బీజేపీ ఈ సీడీలను విడుదల చేసింది’’ అని హార్ధిక్ ఆరోపించాడు.

తనకు తెలిసినంత వరకు త్వరలోనే తనపై వేధింపుల కేసు పెడతారని హార్ధిక్ జోస్యం చెప్పాడు. లంచం, దేశద్రోహం, సెక్స్ టేపులు.. ఎన్ని కుయుక్తులు పన్నినా తానైతే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హార్ధిక్ తేల్చి చెప్పాడు. ‘‘ఇప్పుడు వారు ఓ మహిళను ముందుకుతెచ్చి ఆమెను లైంగికంగా వేధించినట్టు చెప్పిస్తారు. అయినా నేను లొంగను. హార్ధిక్ అంటే ప్రజలు.. ప్రజలంటే హార్ధిక్’ అని సోషల్ మీడియాలో హార్ధిక్ పోస్ట్ చేశాడు.

More Telugu News