Japan: జపాన్, న్యూజిలాండ్, నెదర్లాండ్, ఫిన్లాండ్ లో విద్యావిధానం ఎలా ఉంటుందో తెలుసా?

  • జపాన్ లో హైస్కూల్ లో చదవకున్నా యూనివర్సిటీలో చదవొచ్చు
  • నెదర్లాండ్స్ లో హోం వర్క్, ఒత్తిడి ఉండదని, సంతోషంగా ఉంటారని యునిసెఫ్ చెప్పింది
  • న్యూజిలాండ్ లో ఐదేళ్లు పూర్తైతే కానీ స్కూల్ కు పంపరు
  • ఫిన్లాండ్ లో ఏడేళ్ల తరువాతే స్కూలు, స్కూల్ ఆటపాటల్లోనే చదువు

నేడు బాలల దినోత్సవం!
ఈ సందర్భంగా వివిధ దేశాల్లోని విద్యావిధానాల్లో అత్యుత్తమ విధానాల గురించి చెప్పుకుంటే... ప్రపంచంలోని అత్యధిక అక్షరాస్యత గల అగ్రగామి దేశాల్లో జపాన్‌ ఒకటన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి విద్యావిధానం విభిన్నమైనది. అక్కడ పలానా తరగతులన్నీ చదవాలనే నియమం లేదు. హైస్కూల్‌ విద్య అభ్యసించకపోయినా యూనివర్సిటీ విద్యనభ్యసించవచ్చు. అందుకు నిర్దిష్ట విధానం ఉంది.

 అలాగే నెదర్లాండ్‌ దేశంలోని విద్యార్థులు అన్ని దేశాల్లో విద్యాభ్యాసం చేసే బాలల కంటే సంతోషంగా ఉంటారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యునిసెఫ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అక్కడి స్కూళ్లలో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వరు. పిల్లలపై ఒత్తిడి కూడా చాలా తక్కువే.

 అలాగే న్యూజిలాండ్‌ లో విద్యావిధానం కూడా విభిన్నమైనదే. అక్కడ ఎవరికైనా 5 ఏళ్లు పూర్తైతే కానీ ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభంకాదు. అలాగే అక్కడి పాఠశాలల్లో మనలా తరగతి గదిలో పిల్లలంతా ఒకే చోట బల్లలు వేసుకుని కూర్చోవడం ఉండదు. పుస్తకాల్లేకుండా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తారు.

ఫిన్లాండ్‌ అనుసరిస్తున్న విద్యావిధానాన్ని అమెరికా అనుసరించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ హోవర్డ్‌ గార్డెనర్‌ సూచించారంటే అక్కడి విద్యావిధానం ఎంత ఉత్తమంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫిన్లాండ్‌ లో ఏడేళ్ల తరువాతే పిల్లల్ని పాఠశాలల్లో చేర్చుకుంటారు. విద్యావిధానంలో ఏమాత్రం ఒత్తిడి ఉండదు.

పాఠాల్లా కాకుండా పాటల రూపంలో బోధిస్తారు. ఆటల ద్వారానే అనేక విషయాలు నేర్చుకునేలా విద్యావిధానాన్ని అక్కడి ప్రభుత్వాలు రూపొందించడం విశేషం. పాఠశాల వేళలు కూడా విద్యార్థులకు అనువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ సమయం ఉంటాయి.

More Telugu News