India: మమ్మల్ని టార్గెట్ చేయడం మానుకోవాలి.. శాంతి, అభివృద్ది అన్ని దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి: చైనా

  • అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ లు చైనాను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని విజ్ఞప్తి
  • ఎపెక్ లో భారత్ సభ్యత్వానికి ట్రంప్ మద్దతు
  • రాజకీయం చేయద్దంటున్న చైనా 

మనీలాలో ఆసియాన్ సమావేశాల సందర్భంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ దేశాధినేతలు సమావేశమై చర్చించారు. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడుపడడం లేదు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ను కూడా కీలక భాగస్వామిగా చేర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చొరవ తీసుకోవడాన్ని చైనా భరించలేకపోతోంది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకారంలో 21 సభ్యదేశాలున్నాయి. పసిఫిక్‌ తీరప్రాంతం కలిగిన ఈ 21 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి.

ఈ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ముందస్తు వ్యూహంలో భాగంగా ట్రంప్ ఎపెక్ లో భారత్ సభ్యత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఇది చైనాకు కంటగింపుగా మారుతోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ప్రాబల్యం పెరుగుతుండటంపై చైనా ఆందోళన చెందుతోంది.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖాధికారులు స్పందించారు. శాంతి, అభివృద్ది అన్ని దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని వారు పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలను, అంతర్జాతీయ వాతావరణాన్ని కొత్తమార్పులు ప్రతిబింబించాలని వారు సూచించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఆమోదయోగ్యమని చెప్పిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షుంగ్, ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని అన్నారు.

ఒక దేశానికి వ్యతిరేకంగా కొత్త విధానాలు ఉండకూడదని చెప్పిన ఆయన, చైనా విదేశాంగ విధానంలో భాగంగా దేశాల మధ్య స్నేహపూర్వక సహకారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ లు చైనాను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశంపై భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ, నాలుగుదేశాల సమావేశంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు వెల్లడించారు.

More Telugu News