సెక్స్ సీడీతో అడ్డంగా దొరికిన హార్ధిక్ పటేల్.. సోషల్ మీడియాలో వైరల్!

14-11-2017 Tue 06:21
  • ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న హార్ధిక్ పటేల్
  • గుజరాత్ ఎన్నికల వేళ బయటపడిన సీడీ
  • రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు
  • బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్న పటేల్ ఉద్యమ నేత
పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్‌దిగా చెబుతున్న ఓ సెక్స్ సీడీ ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆయన బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు కూడా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాసలీలల సీడీ బయటపడడం రాజకీయంగా పెను దుమారమే లేపుతోంది. గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ బయటపడడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మే 16న చిత్రీకరించినట్టు రికార్డయిన ఆ సీడీలో హార్ధిక్‌ లా వున్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.

 తన సెక్స్ సీడీ బయటపడడంపై హార్ధిక్ పటేల్ స్పందించాడు. తనను దెబ్బకొట్టి, గుజరాత్ ఎన్నికల్లో లాభ పడేందుకే ఈ సీడీని బయటపెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో  ఇదో భాగమని విమర్శించాడు. హార్ధిక్ పటేల్ ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసని, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని బీజేపీకి హితవు పలికాడు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ అన్నాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.