krishna district: 'ఒరే!.. బోటు తిరగబడిపోయింది పదండ్రా...!' అంటూ సహచరులను అప్రమత్తం చేసిన మత్స్యకారుడు!

  • నీటి ఒరవడికి భిన్నంగా వెళ్లిన బోటు 
  • ఒక్కసారిగా ఊగిపోయిన బోటు.. ప్రయాణికుల హాహాకారాలు 
  • కళ్ల ముందే పలువురు జల సమాధి  
  • ఆ డ్రవర్ కు అవగాహన లేదు 

'ఒరే!.. బోటు తిరగబడిపోయింది పదండ్రా'... అంటూ మరో ఆలోచన చేయకుండా ముందుకు కదిలామని ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన మత్స్యకారులలోని ఓ వ్యక్తి తెలిపాడు. విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని మరింత బాగా చూసేందుకు పర్యాటకులు బోట్లలో నదిలోకి వస్తారని వారు చెప్పారు.

తమ బోట్లలో వారిని నీటి ఒరవడిని బట్టి కొంత దూరం తీసుకెళ్లేందుకు తలా ఒకరికి 20 రూపాయలు వసూలు చేసి, నదిలోకి తీసుకెళ్తామని అన్నారు. 'రివర్ బోటు ఎడ్వెంచర్స్'కు చెందిన మెకనైజ్డ్ బోటు ఒకటి పర్యాటకులతో విజయవాడ నుంచి రావడం చూశామని ఆయన చెప్పారు. అలా వస్తున్న బోటు నీటి ఒరవడికి పూర్తి భిన్నంగా ప్రయాణిస్తోందని, ఇంతలో ఒక్కసారిగా అది ఊగిపోవడం ప్రారంభించిందని, అయితే ప్రయాణికులు హారతి దృశ్యాన్ని చూసి, ఉత్సాహంగా బోటును ఊపుతున్నారేమోనని భావించామని అతను అన్నాడు.

తమ బోటులో ముగ్గురు పర్యాటకులు ఉండడంతో వారిని దించేసేందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఇంతలో హాహాకారాలు వినిపించాయని, వెనక్కి తిరిగి చూసేసరికి బోటు బోల్తా పడిపోయిందని అన్నారు. దీంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని ఆయన అన్నారు. వెంటనే వెనక్కి వెళ్లడం మానేసి, దగ్గర్లోని మరో మూడు బోట్లలో ఉన్న స్నేహితులతో..  'ఒరేయ్! బోటు బోల్తాపడింది పదండ్రా'...! అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్లానని ఆయన చెప్పారు.

అప్పటికే ఈతకొట్టేందుకు కష్టపడుతున్న 15 మందిని రక్షించామని ఆయన అన్నారు. మళ్లీ వెళ్లే సరికి ఎవరూ కనబడలేదని ఆయన చెప్పారు. కళ్ల ముందే తోటి మనుషులు జల సమాధి కావడం బాధగా ఉందని ఆయన చెప్పారు. డ్రైవర్ కు నదీ జలాలపై అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన అన్నారు. అక్కడ లోతు కేవలం 10 నుంచి 15 అడుగుల మేర మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ప్రాంతానికి బోటు వెళ్లడం ప్రమాదకరమని ఆయన చెప్పారు. అంతే కాకుండా నీటి ఒరవడిని బట్టి బోటును నిలపాల్సి ఉంటుందని, అయితే, ఒరవడికి అడ్డంగా బోటును నిలిపాడని, ఇది కూడా ప్రమాదానికి కారణమని ఆయన చెప్పారు.

More Telugu News