Hafiz Saeed: పాక్ టెర్రరిస్ట్ హఫీజ్‌ సయీద్‌ను హతమార్చేందుకు డీల్.. మరింత భద్రత!

  • హఫీజ్‌ను హతమార్చేందుకు విదేశీ గూఢచార సంస్థ కుట్ర
  • రూ.8 కోట్లతో డీల్
  • భద్రత కట్టుదిట్టం చేయాలని పంజాబ్ హోంశాఖకు అధికారుల ఆదేశం

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి,  జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ మరింత భద్రత కల్పించింది. ఆయనను హతమార్చేందుకు ఓ విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రణాళికలు రచిస్తోందని, హఫీజ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశిస్తూ పంజాబ్ హోంశాఖకు ఉన్నతాధికారులు లేఖ రాశారు. సయీద్‌ను అంతం చేసేందుకు విదేశీ గూఢచార సంస్థ ఇద్దరితో రూ.8 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు హోంశాఖకు రాసిన లేఖలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ పేర్కొంది.

గతేడాది జనవరి నుంచి హఫీజ్ సయీద్ గృహ నిర్బంధంలో ఉన్నాడు. ప్రజా భద్రతా చట్టం కింద గత నెలలో ఆయన నిర్బంధాన్ని మరో నెల రోజులు పొడిగించారు. సయీద్ నేతృత్వంలోని జేయూడీని అమెరికా 2014లో విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంతేకాదు ఆయన తలకు రూ. 65 కోట్ల రివార్డును సైతం ప్రకటించింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్‌కు భద్రతను కట్టుదిట్టం చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News