ఇలాగే వదిలేస్తే.. తెలంగాణ సీఎం షర్మిల, రాష్ట్రపతి విజయమ్మ అంటారు!: జగన్ పై మంత్రి ఆదినారాయణ రెడ్డి సెటైర్లు

10-11-2017 Fri 12:54
  • బొత్స, రఘువీరాలు భారీ పెళ్లిళ్లు చేశారు.. అయినా డిపాజిట్లు కోల్పోయారు
  • జగన్ అత్తగారింటికి వెళ్లారు
  • వైసీపీ లేకపోవడంతో అసెంబ్లీ ప్రశాంతంగా జరుగుతోంది

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్రపై' మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనాలు ఓట్లు వేయరని ఆయన అన్నారు. 2014 ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డిలు భారీ స్థాయిలో పెళ్లిళ్లు జరిపారని... అయినా, ఎన్నికల్లో వారిద్దరికీ డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు.

పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన జగన్... ప్రస్తుతం అత్తగారింటికి (సీబీఐ కోర్టు) వెళ్లారని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం చాలా బాగుందని అన్నారు. వైసీపీ వైరస్ లాంటిదని... వైరస్ లేకపోతే ఎంత బాగుంటుందో, సభలో వైసీపీ లేకపోవడం వల్ల కూడా అలాగే ఉందని చెప్పారు. ఏపీకి కాబోయే సీఎం తానే అంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని... ఆయనను ఇలాగే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతుందని, విజయమ్మ రాష్ట్రపతి అవుతారని చెబుతారని ఎద్దేవా చేశారు.